మంచు కురిసిన రాతిరి మనసున కలవరింత !హృదయ ఫలకాన నిండిన నీ రూపం యెదురుగా నిలబడినవేళ యెదలో కదలిక !కానీ నీవులేవు !భ్రమ !
దైహిక బంధాలతో జీవనపోరాటం మనకెందుకు ?
మమతల మానసిక బంధాలు మన యిరువురినీ కలిపాయి ,
ఆనాటి ఆ మల్లెతోటలో కలిసిన మన మధుర చెలిమి ,
చిన్న నాటి లేలేత బాల్యపుఆటపాటలు యెంతబాగున్నాయో ?
ప్రేమంటే తెలియకుండా మనం కలుసుకున్నాం , ఆడుకున్నాం !
కోయిలమ్మ తీయని గళం లో నా గళం కలిపి పాడాను !
నాపాటలో నీమాటను కలిపి నన్ను మురిపించావు!
గుజ్జనగూళ్ళు కట్టుకున్నాం ,బొమ్మలపెళ్ళిళ్ళు చేసాం !
ఉషా కిరణాలతో ఉల్లాసంగా నవ్వుకున్నాం మైమరిచాం,
యవ్వనపు తొలిమలుపులో విడిపోయాం !
ఈనాటికీ సాగరసంగమతీరంలో నడయాడిన మన అడుగుజాడలు ,
ఎన్నియుగాలైనా నా మదిలో చెరగని చెదరని జ్ఞాపకాలు ,
నీ వునికి తెలియని నాకు జ్ఞాపకాలేవునికి అయ్యాయి !
అనుబంధం చెప్తున్నది నువ్వు యెక్కడో వున్నావని ,
ఆత్మీయత చెప్తున్నది నువ్వు నా మనసులోనే వున్నావని ,
మానసికబంధాలకు మధుర భావనలకు భాషతో పనిలేదుగా ,
నిరంతర నిర్మల నిర్గుణ మన ఆత్మల కలయిక ,
అనంత నిరంతర మధుర పరిమళా వాహినిలో
ఎన్నడో యెన్నడో యేకమయ్యాయి ,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి